Mariupol: మారిపోల్ లో హృదయ విదారక పరిస్థితులు.. పెద్ద ఎత్తున పౌర ప్రాణ నష్టం
- 12 రోజుల్లో 1,582 మంది మృతి
- సామూహిక ఖననం
- అమాయక పౌరులను రష్యా లక్ష్యం చేసుకుంటోంది
- యుద్ధ నేరాలకు తక్షణం ముగింపు పలకాలి
- ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా
రష్యా దాడులతో ఉక్రెయిన్ లోని మారిపోల్ పట్టణంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున అమాయక పౌరులు రష్యా సైనిక దాడులకు బలైపోతున్నట్టు తెలుస్తోంది. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటికే 1,500మందికి పైగా పౌరులు మరణించి ఉంటారని అక్కడి అధికారిక లెక్కలే చెబుతున్నాయి.
‘‘దీనికి వెంటనే ముగింపు పలకాలి. ఎవరిది తప్పు అన్నది కాదు ముఖ్యం. ఎవరు మొదలు పెట్టారన్నది కూడా కాదు. వెంటనే ఆగిపోవాలి’’అని ఓ సామాజిక కార్యకర్త వొలొదిమిర్ బికోవవ్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా సైతం దీన్ని అతిపెద్ద మానవ విపత్తుగా అభివర్ణిస్తూ.. పౌరుల భౌతిక కాయాలను పూడ్చి పెడుతున్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘ముట్టడికి గురైన మారిపోల్ ఇప్పుడు అత్యంత దారుణమైన మానవతా విపత్తును ఎదుర్కొంటోంది. 12 రోజుల్లో 1,582 మంది పౌరులు చనిపోయారు. పెద్ద ఎత్తున వారిని సామూహికంగా ఖననం చేయాల్సిన పరిస్థితి. ఉక్రెయిన్ సైన్యాన్ని ఓడించలేక నిరాయుధులపై పుతిన్ బాంబులు వేస్తున్నారు. మానవతా సాయాన్ని అడ్డుకుంటున్నారు. రష్యా యుద్ధ నేరాలకు ముగింపు పలకాలి’’ అని ట్వీట్ చేశారు.