India: పాక్ భూభాగంలోకి భారత్ క్షిపణి.. తీవ్రంగా పరిగణిస్తున్నామన్న పాకిస్థాన్

Pakistan wants international Community on super sonic issue

  • భారత్ నుంచి వెళ్లి పాక్ భూభాగంలో పడిన నిరాయుధ సూపర్ సోనిక్ క్షిపణి
  • అనేక సందేహాలకు తావిస్తోందన్న పాక్
  • అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని వేడుకోలు

భారత్ నుంచి దూసుకొచ్చిన ఓ నిరాయుధ సూపర్ సోనిక్ క్షిపణి తమ భూభాగంలో పడడంపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై భారత్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన విషయమని, ఏదైనా అనూహ్య ఘటన జరిగినప్పుడు దానిని ఎదుర్కొనే రక్షణ ప్రొటోకాల్, సాంకేతిక భద్రతకు సంబంధించి ఈ ఘటన అనేక సందేహాలకు తావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

భారత్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, దీనిపై ఉమ్మడి విచారణ అవసరమని పేర్కొంది. అంతేకాదు, ఈ విషయంలో అంతర్జాతీయ జోక్యం కూడా అవసరమని నొక్కి చెప్పింది. క్షిపణులను భారత సాయుధ బలగాలు సరిగా నిర్వహిస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజం తెలుసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.

బుధువారం సాయంత్రం దాదాపు ఏడు గంటల సమయంలో హర్యానాలోని సిర్సా నుంచి దూసుకెళ్లిన నిరాయుధ సూపర్ సోనిక్ క్షిపణి పాకిస్థాన్‌లో పడింది. దీనివల్ల పాక్ భూభాగంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. తమ భూభాగంలో ఈ క్షిపణి మొత్తం 124 కిలోమీటర్లు ప్రయాణించినట్టు పాక్ పేర్కొంది. ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన పాక్.. తాజాగా ఈ విషయంలో మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య స్థిరత్వాన్ని పెంపొందించేందుకు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరింది.

  • Loading...

More Telugu News