Punjab]: పంజాబ్ పోలీసు శాఖ కీలక నిర్ణయం.. 122 మంది నేతలకు భద్రత రద్దు
- జాబితాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు
- ఎన్నికైన ఎమ్మెల్యేలకూ భద్రత ఉపసంహరణ
- పంజాబ్ పోలీసు శాఖ కీలక నిర్ణయం
సామాన్యుల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలన ప్రారంభం కాకముందే పంజాబ్‌లో పలు కీలక నిర్ణయాలు జరిగిపోతున్నాయి. పంజాబ్ పోలీసు శాఖ శుక్రవారం నాడు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆ రాష్ట్రానికి చెందిన 122 మంది కీలక రాజకీయ నేతలకు భద్రత రద్దు అయిపోయింది. ఇలా సెక్యూరిటీ రద్దు అయిన నేతల్లో మాజీ మంత్రులు సహా మాజీ ఎమ్మెల్యేలు, ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉండటం గమనార్హం.
ఈ మేరకు ఆ రాష్ట్ర అడిషనల్ డీజీ (సెక్యూరిటీ) శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న భగవంత్ మాన్ రాష్ట్ర డీజీపీ వీకే భావ్రాను కలిసిన కొద్దిసేపటికే ఇలా భద్రతను ఉపసంహరిస్తూ ప్రకటన రావడం గమనార్హం. ఇక ఈ నెల 16న సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న భగవంత్ మాన్ సింగ్ ముందుముందు ఇంకెలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.