YSRCP: ఆ వైసీపీ ఎమ్మెల్యేకు నేడు రెండు పండుగలు!
![jammalamadugu mla bprn on ysrcp formation day](https://imgd.ap7am.com/thumbnail/cr-20220312tn622c69c4df84b.jpg)
- మార్చి 12న జన్మించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే
- జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో సుధీర్ రెడ్డి ఒకరు
- వైసీపీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభం
ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 11 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఆ పార్టీ 12వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ స్వయంగా పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నేతల దాకా ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు.
వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ నేతలకు ఓ పండుగ లాంటిదేనని చెప్పక తప్పదు. అయితే కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆ పార్టీ యువ నేత డాక్టర్ మూలె సుధీర్ రెడ్డికి అంతకంటే కూడా ఎక్కువేనని చెప్పాలి. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నాడే ఆయన తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సుధీర్ రెడ్డి మార్చి 12న జన్మించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి.. సుధీర్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు.
వృత్తిరీత్యా వైద్యుడైన సుధీర్ రెడ్డి.. జగన్ పార్టీ ప్రారంభించడంతో రాజకీయాల్లోకి దూకేశారు. 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ టికెట్‌పై గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత టీడీపీలోకి చేరిపోవడంతో సుధీర్ రెడ్డికి ఏకంగా ఎమ్మెల్యే టికెట్ దక్కింది. 2019 ఎన్నికల్లో ఆయన జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ సొంత జిల్లాకు చెందిన సుధీర్ రెడ్డి.. జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో ఒకరిగా ఉన్నారు.