Bhagwant Mann: చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నాం.. వేచి చూడండి: భగవంత్ మాన్
- గవర్నర్ ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరిన ఆప్
- ఎమ్మెల్యేల మద్దుతు లేఖ సమర్పణ
- ఈ నెల 16న భగత్ సింగ్ స్వగ్రామంలో ప్రమాణం
- భగత్ సింగ్ కు నివాళి అర్పించాలని పిలుపు నిచ్చిన కాబోయే సీఎం
పంజాబ్ లో అధికారం ఏర్పాటుకు సంపూర్ణ మెజారిటీ సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలిసింది. ఆప్ తరఫున సీఎం అభ్యర్థిగా ఎంపికైన భగవంత్ మాన్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.
‘‘నేను గవర్నర్ ను కలిశాను. మా పార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్న లేఖను సమర్పించి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరించాను. ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలని అనుకుంటున్నారంటూ గవర్నర్ ప్రశ్నించారు. భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కర్ కలాన్ లో ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాను’’ అని భగవంత్ మాన్ వెల్లడించారు.
మంచి కేబినెట్ ను ఏర్పాటు చేసి, చారిత్రక నిర్ణయాలు తీసుకుంటామని మాన్ ప్రకటించారు. పంజాబ్ వ్యాప్తంగా ప్రజలు వచ్చి భగత్ సింగ్ కు నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. గతంలో ఎవరూ తీసుకోని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నామని.. వేచి చూడండని భగవంత్ మాన్ పేర్కొన్నారు.