Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం చకచకా అడుగులు.. ఆస్తి మదింపు కోసం బిడ్ల ఆహ్వానం
- రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పేరుతో ఉత్తర్వుల జారీ
- ఏప్రిల్ 4వ తేదీ వరకు బిడ్లకు ఆహ్వానం
- స్టీల్ ప్లాంట్, దాని అనుబంధ సంస్థల అస్తుల లెక్కింపు
- జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నివేదిక
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం చకచకా అడుగులు వేస్తోంది. సంస్థ ఆస్తి మదింపుదారు ఎంపిక కోసం బిడ్లు ఆహ్వానిస్తూ ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ పేరుతో నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు బిడ్లు దాఖలు చేయొచ్చని అందులో పేర్కొంది. ఆ తర్వాతి రోజు బిడ్లు తెరుస్తారు.
బిడ్డింగులో ఎంపికైన వారు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్), దాని అనుబంధ సంస్థల అన్ని ఆస్తుల విలువను లెక్కించాల్సి ఉంటుంది. అలాగే, ఆస్తుల భౌతిక స్థితిగతులతోపాటు వాటికి సమీపంలో ఉన్న ప్రైవేటు ఆస్తుల క్రయ విక్రయాలు, అవి ఎంత ధర పలుకుతున్నాయి? వంటి వివరాలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. అంతేకాదు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి నివేదికను తయారుచేయాల్సి ఉంటుందని ఆ ఆదేశాల్లో ఆర్థికశాఖ పేర్కొంది.