Punjab: ఇద్దరు సీఎంల రాజీనామా.. 16న పంజాబ్‌కు కొత్త సీఎం
![bhagavanth singh mann will take oath as cm on 16th of this month](https://imgd.ap7am.com/thumbnail/cr-20220311tn622b1cede13e2.jpg)
- చన్నీ, ధామి సీఎం పదవులకు రాజీనామా
- 16న పంజాబ్ సీఎంగా మాన్ ప్రమాణం
- భగత్ సింగ్ స్వగ్రామంలో ప్రమాణ స్వీకార వేడుక
పంజాబ్ సీఎంగా కొత్త నేత ఎన్నికకు రంగం సిద్దమైపోయింది. ఇటీవలే ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ రెండు చోట్లా ఘోరంగా ఓడిపోయారు. కాంగ్రెస్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రికార్డు విక్టరీ కొట్టింది. 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ ఏకంగా 92 సీట్లను గెలుచుకుంది. ఎన్నికలకు ముందే ఆప్ తన సీఎం అభ్యర్థిగా భగవంత్ సింగ్ మాన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే మీడియా ముందుకు వచ్చిన భగవంత్ మాన్.. తాను భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కర్ కలాన్‌లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 16న భగవంత్ మాన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లుగా ఆప్ తెలిపింది.
మరోవైపు నిలబడ్డ రెండు చోట్ల ఓడిన చన్నీ పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా ఉత్తరాఖండ్‌లో బీజేపీ విక్టరీ కొట్టినా.. ఆ పార్టీకే చెందిన సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో ధామి కూడా శుక్రవారం నాడు సీఎం పదవికి రాజీనామా చేశారు.