Amarinder Singh: కాంగ్రెస్ నాయకత్వం ఎప్పటికీ గుణపాఠం నేర్చుకోదు: అమరీందర్ సింగ్ ఫైర్
- పంజాబ్ ఓటమికి కెప్టెనే కారణమన్న సుర్జేవాలా
- యూపీలో ఘోర పరాభవానికి కారకులెవరన్న అమరీందర్
- గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ఓటమికి కారణమెవరంటూ ప్రశ్నలు
ఇంత జరిగినా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోదని కెప్టెన్ అమరీందర్ సింగ్ ఫైర్ అయ్యారు. నాలుగున్నరేళ్ల కెప్టెన్ అమరీందర్ సింగ్ పాలన వల్లే కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ లో ఘోర పరాభవం ఎదురైందన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా కామెంట్లకు ఆయన దీటుగా బదులిచ్చారు. సుర్జేవాలా వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేస్తూ ఘాటైన కామెంట్లను చేశారు.
‘‘కాంగ్రెస్ నాయకత్వం ఇక ఎప్పటికీ గుణపాఠం నేర్చుకోదు. ఉత్తరప్రదేశ్ లో అవమానకర రీతిలో ఓడిపోయినందుకు కారణం ఎవరు? మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ ఓటమికి కారణమెవరు? దానికి సమాధానం గోడపై పెద్దపెద్ద అక్షరాలతో రాశారు. అయినా వాటిని కాంగ్రెస్ నాయకత్వం చదువుకోదు’’ అంటూ మండిపడ్డారు.
కాగా, సిద్ధూతో గొడవల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన ఆయన.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరిట పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తుపెట్టుకుని పాటియాలా అర్బన్ నుంచి పోటీ చేశారు. ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ చేతిలో ఓటమిపాలయ్యారు.