Shane Warne: ఈ నెల 30న ఎంసీజీలో లక్ష మంది అభిమానుల మధ్య షేన్ వార్న్ అంత్యక్రియలు!
- థాయ్ లాండ్ లో గుండెపోటుతో మరణించిన వార్న్
- ఆస్ట్రేలియా జాతీయ పతాకం కప్పిన పేటికలో మృతదేహం తరలింపు
- ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న వార్న్ అంత్యక్రియలు
స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ థాయ్ లాండ్ లోని ఓ విల్లాలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో క్రికెట్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణం సహజమైనదేనని, గుండెపోటుతో ఆయన మృతి చెందారని అక్కడ నిర్వహించిన అటాప్సీలో తేలింది.
మరోవైపు వార్న్ భౌతికకాయం ఆయన స్వదేశం ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఆస్ట్రేలియా జాతీయ పతాకం కప్పిన శవపేటికలో ఆయన మృత దేహాన్ని తరలించారు. ఒక ప్రత్యేక విమానంలో మెల్బోర్న్ లోని ఎస్సెండాన్ ఫీల్డ్స్ విమానాశ్రయానికి భౌతికకాయం వచ్చింది. ఈ సందర్భంగా విమానాశ్రయానికి వార్న్ కుటుంబసభ్యులు, స్నేహితులు, వ్యక్తిగత సహాయకుడు నోలన్ తో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎయిర్ పోర్టుకు వచ్చారు.
ఈ నెల 30వ తేదీన వార్న్ అంత్యక్రియలు జరగనున్నాయి. మెల్ బోర్న్ లోని క్రికెట్ మైదానంలో లక్ష మంది అభిమానుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో స్పిన్ మాంత్రికుడి అంత్యక్రియలను జరపనున్నారు. మరోవైపు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఉన్న వార్న్ విగ్రహానికి అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. విగ్రహం వద్ద పూలతో పాటు ఆయనకు ఇష్టమైన సిగరెట్లు, బీర్లు పెడుతున్నారు. అభిమానుల హృదయాల్లో వార్న్ ఎంతటి ముద్ర వేశాడనేది చెప్పడానికి ఇదొక నిదర్శనం.