Telangana: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తి.. రేపే తీర్పు
- బీజేపీ సభ్యులను సస్పెండ్ చేసిన అసెంబ్లీ
- హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యేలు
- అసెంబ్లీ కార్యదర్శికి అందని నోటీసులు
- విచారణను ముగించిన హైకోర్టు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు విచారణను ముగించింది. రేపు మధ్యాహ్నం తీర్పు వెలువరించనున్నట్లుగా ప్రకటించింది. రాజ్యాంగ విరుద్ధంగా తమను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారని, కనీసం తమను సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానం కాపీలను కూడా తమకు అందజేయలేదంటూ బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్‌పై బుధవారమే విచారణ చేపట్టిన హైకోర్టు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసి, విచారణను గురువారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక నేటి విచారణలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి తాము నోటీసులు అందజేయలేకపోయామంటూ పిటిషనర్లతో పాటు హైకోర్టు సిబ్బంది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అసెంబ్లీ కార్యదర్శి వద్దకు వెళ్లేందుకు తాము యత్నించగా పోలీసులు అడ్డుకున్నారని, కనీసం వాట్సాప్ ద్వారా పంపుదామన్నా..కార్యదర్శి ఫోన్ స్వీచ్ ఆఫ్‌లో ఉందని వారు తెలిపారు. దీంతో ఈ కేసులో విచారణ ముగిసిందని ప్రకటించిన హైకోర్టు తీర్పును శుక్రవారం వెలువరించనున్నట్లు ప్రకటించింది.