Election Results: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు
- 1270 పాయింట్లు పెరిగి 55,917 వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్
- 384 పాయింట్ల లాభంతో 16,729 వద్ద నిఫ్టీ
- బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో సూచీలు లాభాల్లో
- 7 శాతం పెరిగిన టాటా మోటార్స్ షేర్
- 42 పైసలు బలపడిన రూపాయి విలువ
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్.. స్టాక్ మార్కెట్లపైనా సానుకూల ప్రభావాన్ని కనబరిచింది. ఇవాళ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీలు పైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం 1,270 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 55,917 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 384 పాయింట్ల లాభంతో 16,729 వద్ద నడుస్తోంది.
నిఫ్టీలో బ్యాంక్ సూచీ, ఆర్థిక సేవల సూచీలు, ఆటో ఇండెక్స్ భారీగా లాభపడ్డాయి. వాటి షేర్ విలువ 3 శాతానికిపైగా పెరిగాయి. టాటా మోటార్స్ షేర్ వాల్యూ 7 శాతానికిపైగా పెరిగి.. నిఫ్టీలోనే టాప్ గెయినర్ గా నిలిచింది. ఇటు భారతీ ఎయిర్ టెల్ 2 శాతం పెరిగింది. అవాడా క్లీన్ టీఎన్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో 9 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించడంతో మదుపరులు పెట్టుబడులకు మొగ్గు చూపారు.
ఇటు ముడి చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో పెయింట్స్, రసాయనాలు, ఏవియేషన్ స్టాక్స్ విలువ కొంత పుంజుకుంది. ఇటు రూపాయి విలువ బలపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 42 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్ తో రూపాయి మారకం విలువ 76.20 వద్ద ఉంది.