Ukraine: హంగేరీ ప్రధానికి మోదీ ఫోన్... ఏమేం చర్చకొచ్చాయంటే..!
- భారత విద్యార్థుల తరలింపులో హంగేరీ సాయం
- ప్రధాని విక్టర్‌కు థ్యాంక్స్ చెప్పిన మోదీ
- భారత విద్యార్థులకు వెల్‌కమ్ చెప్పిన విక్టర్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్‌కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు పలు అంశాలపై చర్చించుకున్నారు. రష్యా బాంబుల మోత కురిపిస్తున్న ఉక్రెయిన్‌కు సరిహద్దుగా ఉన్న హంగేరీ..ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపునకు ఎంతగానో కృషి చేసింది. హంగేరీ మీదుగా ఏకంగా 6 వేల మంది భారతీయ విద్యార్థులను మన ప్రభుత్వం సురక్షితంగా దేశానికి తీసుకువచ్చింది.
చర్చల సందర్భంగా భారతీయుల తరలింపునకు సహాయపడిన విక్టర్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చదువుతున్న భారతీయులు హంగేరీలో విద్యను కొనసాగించాలని భావిస్తే అందుకు సహకరిస్తామని విక్టర్ చెప్పారు. ఇక రష్యా, ఉక్రెయిన్ల మధ్య త్వరితగతిన శాంతి నెలకొనే దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. భవిష్యత్తులోనూ ఈ దిశగా చర్చలు కొనసాగించాలని కూడా ఇరు దేశాల ప్రధానులు ఓ నిర్ణయం తీసుకున్నారు.