Ukraine: రష్యాకు మరో షాక్.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిషేధం
- రష్యా సంస్థలతో సంబంధాల స్తంభన
- దావోస్ లో జరిగే సమావేశాలకు అనుమతి లేదు
- రష్యా సంస్థలపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిషేధం
ఉక్రెయిన్‌ను తన వశం చేసుకోవడమే లక్ష్యంగా సాగుతున్న రష్యాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అమెరికా సహా నాటో,ఈయూ దేశాలు రష్యాలపై ఆంక్షల కత్తిని ఝుళిపించాయి. నిన్నటికి నిన్న ఏకంగా రష్యా చమురు దిగుమతులపై అమెరికా నిషేధం విధించి కలకలం రేపింది. అదే బాటలో బ్రిటన్ కూడా నడవనున్నట్లుగా తెలిపింది. తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) కూడా రష్యాపై ఆంక్షల కత్తిని ఎత్తింది.
ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలు విధిస్తున్నట్లుగా ఫోరం ప్రకటించింది. రష్యాకు చెందిన అన్ని సంస్థలతో ఉన్న సంబంధాలను స్తంభింపజేస్తున్నట్లుగా ఫోరం సంచలన ప్రకటన విడుదల చేసింది. ఫోరం ఆంక్షలు విధిస్తే.. ఆ దేశానికి చెందిన ఏ ఒక్క సంస్థ కూడా దావోస్ వేదికగా వార్షిక సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉండదు.