Telangana: కేసీఆర్ చిత్రపటానికి ఏపీలో పాలాభిషేకం!
- 90 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్రకటన
- విశాఖలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
- ఏపీ నిరుద్యోగ జేఏసీ వినూత్న కార్యక్రమం
- ఏపీలోనూ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్
ఒకేసారి దాదాపుగా లక్ష ఉద్యోగాల భర్తీకి కీలక ప్రకటన చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేసిందనే చెప్పాలి. కేసీఆర్ ప్రకటన వెలువడినంతనే ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున సంబరాలు మొదలెట్టేశారు.
కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన తెలంగాణకే పరిమితమైనా.. ఒకేసారి దాదాపుగా లక్ష ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటన చేసిన కేసీఆర్‌పై ఏపీలోనూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రకటనను ఆహ్వానిస్తూ విశాఖలో ఏపీ నిరుద్యోగ జేఏసీ ఏకంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసింది.
విశాఖ పబ్లిక్ లైబ్రరీ వద్ద ఏపీ నిరుద్యోగ జేఏసీ కేసీఆర్‌కు ఏకంగా అభినందన సభ కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఏపీ సీఎం వైఎస్ జగన్ నెరవేర్చాలని ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఏపీలో ఖాళీగా ఉన్న 2,32,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరింది. అంతేకాకుండా ఈ ఉద్యోగాల భర్తీకి 47 ఏళ్ల వయోపరిమితి వర్తించేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.