Corona Virus: 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ
- థర్డ్ వేవ్‌తో నిలిచిన అంతర్జాతీయ విమాన సేవలు
- కరోనా విస్తృతి తగ్గడంతో పునరుద్ధరణ
- కొవిడ్ జాగ్రత్తలతోనే ప్రయాణాలు
- పౌర విమానయాన శాఖ ప్రకటన
కరోనా కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లుగా పౌర విమానయాన శాఖ మంగళవారం నాడు ప్రకటించింది. అయితే ఈ ప్రయాణాల్లో వైద్య,ఆరోగ్య శాఖ సూచించిన నిబంధనలను పకడ్బందీగా అమలు చేయనున్నట్లుగా కూడా ఆ శాఖ ప్రకటించింది.
కరోనా విజృంభణతో విదేశాలకు దేశీయ విమాన సర్వీసులు, దేశానికి విదేశీ విమాన సర్వీసులను ఇప్పటికే పలుమార్లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా తొలి వేవ్‌తో మొదలైన ఈ సర్వీసుల నిలుపుదల.. కరోనా విస్తృతి కాస్తంత తగ్గగానే తిరిగి పునరుద్ధరించబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇటీవలే అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ నిలిపివేసింది. తాజాగా దేశంలో రోజువారీ కరోనా కొత్త కేసుల సంఖ్య 4 వేలకు దిగడంతో కొన్ని జాగ్రత్తలతో అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కరోనా నిబంధనలను మాత్రం తప్పనిసరిగా పాటించనున్నట్లు ప్రకటించింది.