Telangana: గడ్డి అన్నారం మార్కెట్ కూల్చివేత ఆపండి: తెలంగాణ హైకోర్టు ఆదేశం
- అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన వ్యాపారులు
- వ్యాపారులు తమ వస్తువులు తీసుకునేలా చూడాలన్న కోర్టు
- ఈ నెల14కు విచారణ వాయిదా
- మార్కెటింగ్ శాఖ కార్యదర్శి, డైరెక్టర్ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్ పరిధిలోని గడ్డి అన్నారం మార్కెట్ కూల్చివేతలను తక్షణం ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మార్కెట్‌కు చెందిన వ్యాపారులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు కూల్చివేతలను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.
మార్కెట్ తరలింపు నేపథ్యంలో మార్కెట్‌కు చెందిన వ్యాపారులు తమ వస్తువులను తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని ఇదివరకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను పట్టించుకోని అధికారులు మార్కెట్ కూల్చివేత పనులు మొదలెట్టారు.
ఈ నేపథ్యంలో కూల్చివేతలపై గడ్డి అన్నారం మార్కెట్ వ్యాపారులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోని అధికారులు పోలీసు బలగాలను మోహరించి మరీ మార్కెట్‌ను కూల్చివేస్తున్నారని సదరు పిటిషన్‌లో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. మార్కెట్‌లో కూల్చివేతలు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ పిటషన్ విచారణను ఈ నెల 14కు వాయిదా వేసిన కోర్టు.. ఆ విచారణకు మార్కెటింగ్ శాఖ కార్యదర్శి, డైరెక్టర్లు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది.