Amaravati: రిజిస్ట్రేషన్ల విషయంలో అమరావతి రైతులకు ఫోన్లు చేస్తున్న సీఆర్డీఏ అధికారులు
- రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
- హైకోర్టు ఆదేశంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన అధికారులు
- ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రైతులను కోరుతున్న అధికారులు
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నెల రోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్లాట్లను అభివృద్ధి చేసి, మూడు నెలల్లో రైతులకు అప్పగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. మరోవైపు రైతులకు సీఆర్డీఏ అధికారులు ఫోన్లు చేస్తున్నారు. మీకు కేటాయించిన ప్లాట్ ను రిజిస్టర్ చేసుకోండని కోరుతున్నారు.
రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం అమరావతి ప్రాంతానికి చెందిన 28,587 మంది రైతుల నుంచి 34,385 ఎకరాలను సేకరించింది. ఒప్పందం ప్రకారం భూములు ఇచ్చిన రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి. ఈ క్రమంలో రైతులకు 64,735 ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో నివాస ప్లాట్లు 38,282 కాగా, వాణిజ్య ప్లాట్లు 26,453. టీడీపీ హయాంలో 40,378 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు తీర్పుతో ప్రక్రియ మళ్లీ మొదలయింది.