Sunil Gavaskar: నేను అలా వ్యాఖ్యానించి ఉండాల్సింది కాదు: సునీల్ గవాస్కర్ పశ్చాత్తాపం

Sunil Gavaskar Expresses Regret Over ill Timed Comment On Shane Warne

  • షేన్ వార్న్ గొప్ప ప్లేయర్
  • పోలికలకు, విశ్లేషణకు ఇది సమయం కాదు
  • యాంకర్ అడిగిన ప్రశ్నకు నిజాయతీగా బదులిచ్చా
  • ఈ సమయంలో అడగాల్సిన ప్రశ్న కాదది
  • విమర్శలతో వివరణ ఇచ్చిన గవాస్కర్

షేన్ వార్న్ గురించి అనుచితంగా మాట్లాడిన భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన తప్పును గుర్తించారు. ఈ సమయంలో తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. షేన్ వార్న్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించడం తెలిసిందే. అదే రోజు ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమం నిర్వహించింది. అందులో గవాస్కర్ పాల్గొన్నారు. ‘మీరు చూసిన అత్యుత్తమ స్పిన్నర్ వార్న్ యేనా?’ అంటూ వ్యాఖ్యాత వేసిన ప్రశ్నకు.. గవాస్కర్ ఊహించని సమాధానం ఇచ్చారు. 

తన దృష్టిలో వార్న్ గొప్ప స్పిన్నర్ కాదన్నారు. ‘‘అతడి కన్నా ముత్తయ్య మురళీధరన్ మెరుగైన స్పిన్నర్. భారత్ లో వార్న్ కు గొప్ప రికార్డు లేదు. స్పిన్ పిచ్ పై బాగా ఆడగల భారత్ బ్యాట్స్ మెన్ పై మంచి రికార్డు లేని వార్న్ గొప్ప స్పిన్నర్ ఎలా అవుతాడు’’ అంటూ గవాస్కర్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. 

షేన్ వార్న్ ను గొప్ప స్పిన్నర్ గా ప్రపంచంలో ఎక్కువ మంది గుర్తిస్తుంటారు. అటువంటి వ్యక్తి మరణించిన సందర్భంలో గవాస్కర్ అలా తక్కువచేసి మాట్లాడడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వార్న్ మరణించిన సందర్భంగా ఇలా వ్యాఖ్యానించడం ఏంటయ్యా? అని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. 

దీంతో గవాస్కర్ తప్పు తెలుసుకున్నారు. ‘‘నిజానికి ఆ ప్రశ్న అడగకూడనిది. అలాగే, నేను కూడా చెప్పకూడనిది. పోలికలకు, విశ్లేషణకు ఇది సమయం కాదు. వార్న్ క్రికెట్ లో గొప్ప ప్లేయర్. రోడ్నే మార్ష్ కూడా అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు. వారి ఆత్మలకు శాంతి కలగాలి’’ అని గవాస్కర్ తన స్పందన తెలిపారు. తనను అడిగిన ప్రశ్నకు నిజాయతీగా సమాధానం చెప్పానే గానీ, అందులో ఎటువంటి దురుద్దేశం లేదన్నారు.

  • Loading...

More Telugu News