BJP: సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తేయాలి: బండి సంజయ్
- ఈ రోజు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- రెండు నిమిషాల్లోనే ఎలా సస్పెండ్ చేస్తారు?
- ప్రీ ప్లాన్డ్ గా బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- ఇది టీఆర్ఎస్ కుట్ర అన్న సంజయ్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలి రోజుననే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు..కేసీఆర్ సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, గవర్నర్ ప్రసంగం లేకుండా సభనెలా ప్రారంభిస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో వెల్‌లోకి దూసుకువచ్చిన ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లను స్పీకర్ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఇప్పుడు తెలంగాణలో వేడి రాజుకుంది. బీజేపీ నేతలు కావాలనే సస్పెన్షన్ వేటు పడేలా వ్యవహరించారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు.
తాజాగా బీజేపీ తెలంగాణ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తమ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఘాటుగా స్పందించారు. బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీ ఎమ్మెల్యేలను ప్రీప్లాన్డ్‌గానే సస్పెండ్ చేసిందని ఆరోపించారు. సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడమంటే.. ఆ కుట్ర టీఆర్ఎస్ పన్నిన కుట్ర కాదా? అని ఆయన ప్రశ్నించారు.