Shane Warne: షేన్ వార్న్ మృతికి సహజ కారణాలే.. ప్రకటించిన థాయ్ పోలీసులు
- వార్న్ మృతిపై తలెత్తిన పలు సందేహాలు
- పోలీసులకు అందిన శవ పరీక్ష నివేదిక
- వార్న్ కుటుంబ సభ్యులకు తెలియజేసిన పోలీసులు
ప్రముఖ క్రికెటర్ షేన్ వార్న్ మృతిపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్న తరుణంలో.. సహజ కారణాలతోనే వార్న్ ప్రాణాలు విడిచినట్టు థాయిలాండ్ పోలీసులు తాజాగా ప్రకటించారు. షేన్ వార్న్ భౌతిక కాయానికి పోస్ట్ మార్టమ్ (శవ పరీక్ష) పూర్తి అయిన తర్వాత నివేదికను ఆయన కుటుంబానికి తెలియజేసి వారి ఆమోదాన్ని తీసుకున్నట్టు పోలీసులు సోమవారం తెలిపారు.
వార్న్ భౌతిక కాయాన్ని ఆయన కుటుంబానికి అప్పగించేందుకు వీలుగా బ్యాంకాక్ లోని ఆస్ట్రేలియా కాన్సులేట్ కు తరలించనున్నట్టు థాయ్ పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘దర్యాప్తు అధికారులకు శవపరీక్ష నివేదిక అందింది. మరణానికి సహజ కారణమేనని అందులో వైద్యులు పేర్కొన్నారు. చట్టం అనుమతించిన కాలవ్యవధిలోపు ప్రాసిక్యూటర్లకు శవపరీక్ష వివరాలను అందజేస్తాం’’ అని డిప్యూటీ పోలీసు అధికార ప్రతినిధి కిస్సన పథనచరోన్ ప్రకటించారు.
గత శుక్రవారం షేర్ వార్న్ గుండె పోటుతో థాయిలాండ్ లోని సముజనా విల్లాస్ రిసార్ట్ లో మరణించడం తెలిసిందే. ఆయన గదిలో రక్తపు మరకలు ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ అనుమానాలకు తాజా శవపరీక్ష నివేదిక పుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి.