Wriddhiman Saha: సాహాను బెదిరించిన జర్నలిస్టు ఇతనే.. సాహాపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల!

Accused journalist REVEALS his name says he will serve with defamation notice to saha

  • ఇంటర్వ్యూ అడిగిన జర్నలిస్ట్
  • సాహా నిరాకరించడంతో బెదిరించిన వైనం
  • ఇప్పటి వరకు బహిరంగంగా జర్నలిస్టు పేరు వెల్లడించని సాహా
  • స్వయంగా వీడియో షేర్ చేసిన బొరియా మజుందార్
  • సాహాకు పరువునష్టం నోటీసులు పంపుతానని హెచ్చరిక

ఇంటర్వ్యూ ఇచ్చేందుకు నిరాకరించిన తనను ఓ జర్నలిస్టు బెదిరించాడంటూ స్క్రీన్‌షాట్లను షేర్ చేసిన క్రికెటర్ వృద్ధిమాన్ సాహా.. ఇటీవల ఆ జర్నలిస్టు ఎవరనేది బీసీసీఐ నియమిత కమిటీకి చెప్పాడు. ఆ జర్నలిస్టు వివరాలను సాహా తమకు అందించాడని ఆ కమిటీ చెప్పింది తప్పితే, అతడు ఎవరన్నది వెల్లడించలేదు. దీంతో సాహాను బెదిరించిన ఆ జర్నలిస్టు ఎవరనే విషయం అందరిలోనూ చర్చనీయాంశమైంది.

ఇప్పుడా జర్నలిస్టే స్వయంగా బయటపడిపోయాడు. సాహా ఆరోపణలు తప్పని, తన ప్రతిష్ఠను మంటగలిపేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడంటూ స్వయంగా ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ జర్నలిస్టు మరెవరో కాదు.. ఎంతోమంది ప్రముఖ క్రీడాకారులతో పరిచయమున్న బొరియా ముజుందార్. సాహా ఆరోపణలపై మజుందార్ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. 

ప్రతి విషయం వెనక రెండు కోణాలు ఉంటాయని, కానీ, వృద్ధిమాన్ సాహా తన వాట్సాప్ స్క్రీన్‌షాట్లను తప్పుగా షేర్ చేశాడని మజుందార్ అందులో ఆరోపించారు. తన పరువును, విశ్వసనీయతను సాహా దెబ్బతీశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, సాహా తనపై చేసిన ఆరోపణల విషయంలో నిష్పాక్షిక విచారణ జరిపించాలని బీసీసీఐని కూడా కోరానని, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సాహాపై తన లాయర్లు పరువునష్టం నోటీసులు పంపిస్తారని పేర్కొన్నారు.

ఈ మొత్తం వివాదానికి కారణం.. గత నెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేయడమే.  టెస్టు వికెట్ కీపర్ అయిన సాహాకు ఆ జట్టులో చోటు లభించలేదు. అంతేకాదు, పలువురు సీనియర్ క్రికెటర్లను కూడా ఈ సిరీస్‌లో సెలక్షన్ కమిటీ పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో సాహా ఇంటర్వ్యూ కోసం జర్నలిస్టు మజుందార్ ప్రయత్నించారు. 

అందుకు సాహా నిరాకరించడంతో మజుందార్ బెదిరించాడంటూ ఆయనతో జరిగిన వాట్సాప్ సంభాషణ స్క్రీన్ షాట్లను సాహా షేర్ చేశాడు. జర్నలిజం మరీ ఇంతగా దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సాహా ట్వీట్ వైరల్ కావడంతో పలువురు మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలిచారు. ఆ జర్నలిస్టు ఎవరో చెప్పాలని కోరారు. అయినప్పటికీ ఆ జర్నలిస్టు పేరును వెల్లడించేందుకు సాహా నిరాకరించాడు. అతడి పేరు మీడియా ముందు చెప్పబోనని, బీసీసీఐ కనుక అడిగితే అప్పుడు చెబుతానని పేర్కొన్నాడు. 

సాహాను జర్నలిస్టు బెదిరించిన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ.. ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, బోర్డు అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ప్రభ్‌తేజ్ భాటియాలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని విచారణ కోసం నియమించింది. తాజాగా ఈ కమిటీ ఎదుట హాజరైన సాహా కోరిన వివరాలను అందించినట్టు రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ వివరాలను బోర్డుకు పంపుతామన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News