Mithali Raj: సచిన్ తర్వాత అంత గొప్ప ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న మిథాలీ రాజ్
- ఆరు ప్రపంచకప్ లలో పాల్గొన్న రెండో భారత క్రికెటర్
- గతంలో సచిన్ ఒక్కడికే ఈ ఘనత
- తొలి మహిళా క్రికెటర్ గుర్తింపు కూడా ఆమెకే
భారత వెటరన్ మహిళా క్రికెటర్, భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఆదివారం ఒక గొప్ప ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. మహిళల ప్రపంచ క్రికెట్ కప్ లో భాగంగా బే ఓవల్ మైదానంలో భారత్ - పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 245 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందుంచింది. కానీ, పాకిస్థాన్ జట్టు 83 పరుగులకు (26 ఓవర్లు) 5 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది.
ఇక ఈ ప్రపంచకప్ తో మిథాలీ రాజ్ ఆరు ఓడీఐ వరల్డ్ కప్ లలో పాల్గొన్న ఏకైక భారత మహిళా క్రికెటర్ రికార్డును నమోదు చేసింది. 2000, 2005, 2009, 2013, 2017 ప్రపంచ కప్ లలో మిథాలీ పాల్గొంది. ఈ విషయంలో న్యూజిలాండ్ క్రికెటర్ డెబ్బీ హాక్లే, ఇంగ్లండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ ను వెనక్కి నెట్టింది.
ఇక అత్యధిక ప్రపంచకప్ లలో పాల్గొన్న రెండో భారత క్రికెటర్ గా మిథాలీ గుర్తింపు సంపాదించింది. గతంలో ఒక్క సచిన్ కే ఈ రికార్డు సాధ్యపడింది. సచిన్ టెండుల్కర్ 1992, 1996, 1999, 2003, 2007, 2011 క్రికెట్ కప్ లకు భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆరు ప్రపంచ కప్ లు ఆడిన వారిలో టెండుల్కర్, పాకిస్థాన్ క్రికెటర్ జావెద్ మియాందాద్ తర్వాత మూడో వ్యక్తి మిథాలీయే కావడం గమనార్హం.