Sirajuddin Haqqani: తొలిసారి బయటకొచ్చి ముఖం చూపించిన తాలిబన్ల అత్యంత రహస్య నేత, మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ
- పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో తొలిసారి కనిపించిన హక్కానీ
- మీ సంతృప్తి కోసం, నమ్మకాన్నిపెంచేందుకే కనిపిస్తున్నానని వ్యాఖ్య
- అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో హక్కానీ
- హక్కానీ తలపై 10 మిలియన్ డాలర్ల నజరానా
తాలిబన్లలో అత్యంత రహస్యమైన నేతగా, అమెరికా ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాకెక్కిన ఆఫ్ఘనిస్థాన్ అంతర్గతశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ తొలిసారి తన ముఖాన్ని బయటకు చూపించారు. అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా అతడి ఫొటో పాక్షికంగానే కనిపించింది. ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త పోలీసుల నియామకాల్లో భాగంగా నిన్న నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో హక్కానీ తొలిసారి ముఖానికి మాస్క్ లేకుండా కనిపించారు.
హక్కానీ నెట్వర్క్ చీఫ్ అయిన సిరాజుద్దీన్ ఫొటోలు గతంలో వెలుగులోకి వచ్చినప్పటికీ అవన్నీ వెనక నుంచి తీసినవే. కాబట్టి ఆయన ఎలా ఉంటారన్న విషయం ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియదు. గత ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఆయన బయటకు రాలేదు. తాజాగా, పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో కనిపించిన ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ సంతృప్తి కోసం, మీలో నమ్మకాన్ని పెంపొందించడం కోసం మీకోసం బహిరంగ సభలో మీడియా ముందు కనిపిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ముందు హక్కానీ నేత హిబతుల్లా అఖుంద్జాదా ముగ్గురు డిప్యూటీలలో హక్కానీ అత్యంత సీనియర్. అయితే, అఖుంద్జాదా గత కొన్నేళ్లుగా కనిపించకపోవడంతో ఆయన సజీవంగా ఉండకపోవచ్చని ఆఫ్ఘనిస్థాన్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, హక్కానీ సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్లు ఇస్తామని గతంలో అమెరికా ప్రకటించింది.