ICC Womens World Cup 2022: మహిళల ప్రపంచ కప్: అర్ధ సెంచరీ బాదిన స్మృతి.. ఐదు వికెట్లు కోల్పోయిన భారత్
- వడివడిగా వికెట్లు కోల్పోతున్న భారత్
- రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మంధాన, దీప్తి శర్మ
- నిరాశపరిచిన షెఫాలీ వర్మ
మహిళల ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు పరుగుల వద్ద ఓపెనర్ షెఫాలీవర్మ డకౌట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మతో కలిసి స్మృతి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆడుతూ వికెట్లు కోల్పోకుండా అడ్డుకున్నారు. ఇద్దరూ కలిసి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించిన తర్వాత 57 బంతుల్లో రెండు ఫోర్లతో 40 పరుగులు చేసిన దీప్తి శర్మ అవుటైంది.
ఆ వెంటనే భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 75 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్మృతి మంధాన (52) కూడా పెవిలియన్ చేరింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కూడా ఆకట్టుకోలేకపోయింది. 14 బంతులు ఆడి 5 పరుగులు మాత్రమే చేసి అవుటైంది. ఆ వెంటనే రిచా ఘోష్ (1) కూడా పెవిలియన్ బాట పట్టడంతో భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం 31 ఓవర్లు ముగిశాయి. భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్, స్నేహ్ రాణా క్రీజులో ఉన్నారు.