V Srinivas Goud: మంత్రి హత్యకు కుట్ర నిందితుల కస్టడీకి పోలీసుల పిటిషన్
- మంత్రి హత్యకు కుట్రలో ఏడుగురి అరెస్ట్
- వారి కస్టడీ కోసం మేడ్చల్ జిల్లా కోర్టులో పోలీసుల పిటిషన్
- తుపాకుల కొనుగోలు, నిధుల సమీకరణలపై ప్రశ్నించాలన్నపోలీసులు
- కౌంటర్ల దాఖలకు నిందితులకు కోర్టు ఆదేశం
తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసు నిందితులను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ తెలంగాణ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు మేడ్చల్ జిల్లా కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కౌంటర్ అందిన తర్వాత కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేసేందుకు కొందరు నిందితులు ఏకంగా రూ.15కోట్లతో ఓ సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించే యత్నం చేశారని, అయితే నిందితులు, సుపారీ గ్యాంగ్ మధ్య నెలకొన్న విభేదాల కారణంగా పలు నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసు వెలుగు చూసింది.
దీనిపై ప్రాథమిక సమాచారం అందుకున్నంతనే రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు.. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురిని బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో అరెస్ట్ చేసిన విషయం విదితమే. నిందితులు తుపాకులు ఎక్కడ కొనుగోలు చేశారు? సుపారీ గ్యాంగ్‌కు ఇచ్చినట్లుగా భావిస్తున్న రూ.15 కోట్లను ఎక్కడి నుంచి సమీకరించారనే వివరాలను బట్టబయలు చేసేందుకే నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని తమ పిటిషన్‌లో పోలీసులు కోర్టును కోరారు.