Andhra Pradesh: అన్నింటిపైనా చర్చిద్దాం రండి.. టీడీపీకి ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పిలుపు
- అధికారులతో స్పీకర్, మండలి చైర్మన్ భేటీ
- వివేకా హత్యపై చర్చకు కూడా సిద్ధమన్న శ్రీకాంత్ రెడ్డి
- అసెంబ్లీ అధికారాలపైనా చర్చిద్దామని వ్యాఖ్య
ఓ వైపు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు.. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి జరుగుతున్న సీబీఐ దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాల నేపథ్యంలో ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీడీపీలో పెద్ద అంతర్మథనమే జరుగుతోంది.
తన భార్యను అవమానించిన వైనంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోనంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇదివరకే సంచలన ప్రకటన చేశారు. అయితే ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపేందుకు అవకాశం ఉన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే ఎలాగంటూ టీడీపీ సందిగ్ధంలో పడిపోయింది. ఇలాంటి కీలక సమయంలో అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నేతలు హాజరు కావాలంటూ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో శనివారం నాడు స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజులు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన శ్రీకాంత్ రెడ్డి టీడీపీ నేతలకు ఓ కీలక సూచన చేశారు.
ప్రజా సమస్యలే అత్యంత ప్రాధాన్యంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న శ్రీకాంత్ రెడ్డి.. గతంలో టీడీపీలా కాకుండా తాము ప్రతిపక్షాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల పేరు తెచ్చి సమావేశాల నుంచి వెళ్లిపోయారని ఆరోపించిన ఆయన.. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి హాజరవ్వాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండి రాజకీయం చెయ్యాలని టీడీపీ నేతలు అనుకుంటున్నారని ఆరోపించిన శ్రీకాంత్ రెడ్డి.. టీడీపీ బయట మాట్లాడేవి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. వివేకా హత్యపై తప్పుడు రాతలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. దానిపై కూడా అసెంబ్లీ లో చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అసెంబ్లీ అధికారాలపై చర్చకు స్పీకర్ అనుమతితో చర్చించాలని కోరతామన్న శ్రీకాంత్ రెడ్డి.. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని వెల్లడించారు.