UAE: ఉక్రేనియన్లకు ఊరటనిచ్చే ప్రకటన చేసిన యూఏఈ
- ఉక్రేనియన్లకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చిన యూఏఈ
- వీసా లేకుండా వచ్చిన వారు 30 రోజుల పాటు యూఏఈలో ఉండొచ్చు
- మార్చి 3కు ముందు వెళ్లినవారు ఏడాది పాటు ఉండే వెసులుబాటు
రష్యా చేస్తున్న దాడితో ఉక్రేనియన్లు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంత మంది నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు.
ఈ నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించింది. మార్చి తర్వాత యూఏఈకి వచ్చే ఉక్రేనియన్లకు వీసా అవసరం లేదని తెలిపింది. వీసా లేకుండా వచ్చిన వారు 30 రోజుల పాటు యూఏఈలో ఉండొచ్చని చెప్పింది. అంతేకాదు మార్చి 3కు ముందు వచ్చిన ఉక్రేనియన్లు ఎలాంటి జరిమానాలు చెల్లించకుండా ఒక్క ఏడాది పాటు ఇక్కడ ఉండొచ్చని తెలిపింది. ఈ మేరకు యూఏఈ విదేశాంగ శాఖ ప్రకటించింది.
తమ దేశంలో ఉండే ఉక్రేనియన్లకు అత్యవసర సేవలను కూడా అందిస్తామని యూఏఈ తెలిపింది. ఉక్రెయిన్ కు మానవతా సాయంగా 18 మిలియన్ దిర్హామ్ లను పంపనున్నట్టు ప్రకటించింది. యూఏఈలో ప్రస్తుతం 15 వేల మంది ఉక్రేనియన్లు ఉన్నట్టు సమాచారం. ప్రతియేటా యూఏఈని దాదాపు 2.50 లక్షల మంది ఉక్రెయిన్ టూరిస్టులు సందర్శిస్తుంటారు.