Shane Warne: వార్న్ అకాలమరణంతో సర్వత్రా దిగ్భ్రాంతి... స్పందించిన క్రికెట్, రాజకీయ ప్రముఖులు

All over saddened over Shane Warne sudden demise
  • షేన్ వార్న్ గుండెపోటుతో మరణించనట్టు వార్తలు
  • నమ్మలేకపోతున్న క్రికెట్ ప్రపంచం
  • రాజకీయ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతికి గురవుతున్న వైనం
ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ ఉదయం ఆసీస్ దిగ్గజం రాడ్ మార్ష్ మృతితో విషాదంలో ఉన్న క్రికెట్ వర్గాలను తాజాగా వార్న్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వార్న్ గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. వివిధ దేశాల క్రికెటర్లు, ఆయనతో అనుబంధం ఉన్నవారు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఆఖరికి సైప్రస్ వంటి చిన్నదేశం క్రికెట్ బోర్డు కూడా వార్న్ మృతి పట్ల స్పందించిందంటే క్రికెట్ పై ఆయన ముద్ర సుస్పష్టం. 

కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ, స్పిన్ రారాజు షేన్ వార్న్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన స్పిన్ తో మైదానంలో మ్యాజిక్ చేసి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడని కొనియాడారు. మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్పిన్ దిగ్గజం వార్న్ ఇకలేడన్న వార్త తనను కలచివేసిందని తెలిపారు. ఆయన కుటుంబానికి, బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు గడ్కరీ ట్వీట్ చేశారు. 

తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం వార్న్ మరణం పట్ల నమ్మలేకపోయారు. చాలా త్వరగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారని, ఆయన మరణం తమను నిశ్చేష్టకు గురిచేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. వార్న్ అసలు సిసలైన క్రికెట్ మేధావి అంటూ అభివర్ణించారు. 

ఇక, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, శిఖర్ ధావన్, కుమార్ సంగక్కర, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్, యువరాజ్ సింగ్, కార్లోస్ బ్రాత్ వైట్ తదితరులు వార్న్ మరణం పట్ల నమ్మలేకపోతున్నామని తెలిపారు. బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ, వార్న్ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేకపోయానని వెల్లడించారు. వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. 

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. వార్న్ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. ఇక, అక్షయ్ కుమార్ స్పందిస్తూ, నోటమాట రావడంలేదని తెలిపారు. వార్న్ అకాలమరణం చెందాడని విచారం వ్యక్తం చేశారు. వార్న్ లేని క్రికెట్ ను ఊహించుకోలేమని పేర్కొన్నారు.
Shane Warne
Demise
Australia
Cricket

More Telugu News