Dmytro Kuleba: రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు: తీవ్ర ఆరోపణలు చేసిన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి
- ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబు దాడులు
- తమ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న మంత్రి
- అంతర్జాతీయ చట్టమే తమకు ఏకైక సాధనమని వెల్లడి
- రష్యన్లను బోనులో నిలబెడతామని స్పష్టీకరణ
రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఉక్రెయిన్ మొదటి నుంచి ఆక్రోశిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా తీవ్ర ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ నగరాల్లో రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. అయితే, అందుకు గల ఆధారాలను ఆయన చూపించలేకపోయారు.
"నగరాలపై బాంబులు వేస్తున్నారు. ఆక్రమించుకున్న నగరాల్లో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు లెక్కకు మిక్కిలిగా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ చట్టం సమర్థత గురించి మాట్లాడడం కష్టమైన విషయమే!" అంటూ విచారం వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రీ కులేబా ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఇక్కడి చాథమ్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ చట్టం ఒక్కటే తమకు అందుబాటులో ఉన్న సాధనమని అన్నారు. ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులను సృష్టించిన వారిని బోనులో నిలబెట్టేందుకు ఈ నాగరిక ప్రపంచంలో తమకున్న ఆయుధం ఇదేనని కులేబా పేర్కొన్నారు.