KCR: ఝార్ఖండ్ సీఎంతో కేసీఆర్ భేటీ.. అమర జవాన్ల కుటుంబాలకు చెక్కుల అందజేత
- రాంచీలో కేసీఆర్‌కు ఘన స్వాగతం
- గిరిజన ఉద్యమ నేత బిర్సా ముండా విగ్రహానికి కేసీఆర్ నివాళి
- ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కుల అందజేత
- హేమంత్ సోరేన్‌తో కేసీఆర్ చర్చలు మొదలు
- జాతీయ రాజకీయాల్లో మూడో కూటమిపైనే ప్రధానంగా చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో భాగంగా శుక్రవారం ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో భేటీ కోసం రాంచీ వెళ్లిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం రాంచీ చేరుకున్న కేసీఆర్‌కు సోరేన్ నుంచి ఘన స్వాగతం లభించింది.
అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు.. జాతీయ స్థాయిలో మూడో కూటమి ఆవశ్యకతపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించినట్టుగా సమాచారం. ఝార్ఖండ్ సీఎం నివాసానికి చేరుకునే క్రమంలో రాంచీలోని బిర్సా ముండా చౌక్‌లో గిరిజన ఉద్యమ నేత భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి కేసీఆర్ నివాళి అర్పించారు.
ఝార్ఖండ్ పర్యటనలో భాగంగా గల్వాన్ వ్యాలీలో అమరులైన ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు సైనికుల కుటుంబాలకు కేసీఆర్ రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ చెక్కులు అందజేశారు. గల్వాన్ వ్యాలీలో మరణించిన సైనికులకు ఇదివరకే కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాట మేరకు శుక్రవారం ఝార్ఖండ్ పర్యటనలో భాగంగా అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ చెక్కులు అందజేశారు.