Jagan: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం: జగన్
- ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి
- పనులపై అధికారులు మరింత దృష్టి పెట్టాలి
- ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నా సీఎం
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేవీపట్నం మండలం ఇందుకూరు-1లో పునరావాస కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ... నిర్వాసితులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని చెప్పారు. కేంద్ర సర్కారు నుంచి సహాయ సహకారాలు తీసుకుని దీన్ని పూర్తిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.
అలాగే, ఇక్కడి ప్రజల పునరావాస పనులపై అధికారులు మరింత దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. గతంలో పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు కేంద్రసాయంతో పాటు ఏపీ కూడా సాయం చేస్తుందని అన్నారు. కేంద్రం ఇస్తున్న రూ.6 లక్షలతో పాటు ఏపీ అదనంగా 3 లక్షలు ఇస్తుందని చెప్పారు.
కాగా, కాసేపట్లో జలవనరుల శాఖ అధికారులతో జగన్ సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ నుంచి తిరిగి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.