Farmers: ’అమరావతి‘ కోసం 189 మంది అమరులయ్యారు: జేఏసీ నేతలు
- అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు
- మూడు రాజధానుల నిర్ణయంతో ప్రారంభమైన రైతుల పోరాటం
- 4 జనవరి 2020న దొండపాడు రైతు మృతి
- ఆ తర్వాత మరింత మంది రైతుల కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఇప్పటి వరకు 189 మంది అమరులయ్యారని జేఏసీ నేతలు తెలిపారు. చంద్రబాబు హయాంలో అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వం మారిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి రావడంతో షాకయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ 17 డిసెంబరు 2019న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు.
రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందన్న మనస్తాపంతో దొండపాడుకు చెందిన రైతు (58) 4 జనవరి 2020న మరణించాడు. అమరావతి పోరాటంలో అదే తొలిమరణం. ఆ తర్వాత మరింత మంది రైతులు ప్రాణాలు విడిచారు. వీరంతా అరెకరం నుంచి మూడెకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చినవారే.
ప్రభుత్వ నిర్ణయంతో హతాశులైన వీరంతా నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. ఉన్న భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశాక.. చేసేందుకు పనుల్లేక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మానసిక ఆవేదనకు గురై వీరందరూ మరణించినట్టు జేఏసీ నేతలు తెలిపారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.