Russia: రెండో విడత చర్చలు షురూ.. ఫలితం వచ్చేనా?
- బెలారస్ వేదికగా రెండో విడత చర్చలు
- చర్చలకు ముందు దాడులు ఆపేది లేదన్న రష్యా
- ఈ నేపథ్యంలో చర్చల ఫలితంపై అనుమానాలు
యుద్ధంలో ఒకరికొకరు ఏమాత్రం తగ్గకుండా సాగుతున్న రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కాసేపటి క్రితం రెండో విడత శాంతి చర్చలు మొదలయ్యాయి. తొలి విడత చర్చలు జరిగిన బెలారస్ కేంద్రంగానే రెండో విడత చర్చలు కూడా జరుగుతున్నాయి. చర్చల కోసం రష్యా ప్రతినిధి బృందం చర్చల వేదికకు ముందే చేరుకోగా.. ఉక్రెయిన్ ప్రతినిధులు మాత్రం కాస్తంత ఆలస్యంగా చేరుకున్నారు. ఈ కారణంగా ఒకింత ఆలస్యంగానే చర్చలు మొదలయ్యాయి.
యుద్ధం మొదలైన రెండో రోజుననే చర్చలంటూ రష్యా ప్రతిపాదించగా.. బాంబు దాడులు ఆపితేనే చర్చలని వాదించిన ఉక్రెయిన్..రెండు రోజుల తర్వాత గానీ చర్చలకు అంగీకరించలేదు. ఈ క్రమంలో తొలి విడత చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధుల బృందం 3 గంటలకు పైగా చర్చలు జరిపినా..ఎలాంటి ఫలితం రాలేదు. ఇరు దేశాలు తమ తమ వాదనలకు కట్టుబడి ఉన్న నేపథ్యంలో తొలి విడత చర్చలు విఫలమయ్యాయనే చెప్పాలి.
ఇక తాజాగా మొదలైన రెండో విడత చర్చల్లో అయినా రెండు దేశాలు బెట్టు వీడి వారి వారి డిమాండ్లను పరస్పరం గౌరవించుకుంటే యుద్ధం ఆగిపోయినట్లే. అయితే చర్చల వేళ దాడులను ఆపేది లేదంటూ రష్యా చేసిన ప్రకటనతో ఈ చర్చల్లో అయినా ఫలితం వస్తుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.