Volodymyr Zelensky: మా పౌరులకు కలిగిన ప్రతి నష్టానికి రష్యానే పరిహారం చెల్లిస్తుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
- ఉక్రెయిన్ పై రష్యా భీకరదాడులు
- మడమతిప్పని పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ సైన్యం
- నిత్యం సందేశాలతో స్ఫూర్తి నింపుతున్న అధ్యక్షుడు
- ఉక్రెయిన్ గురించి పుతిన్ కు ఏమీ తెలియదని వెల్లడి
రష్యా సైన్యం తమ దేశంలో ప్రవేశించి భీకర దాడులు జరుపుతున్నప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ దేశం విడిచిపోకుండా, సైన్యం, ప్రజలతో పాటే ఉంటూ అందరి మనసులను చూరగొంటున్నారు. ఆయన ఎప్పటికప్పుడు వీడియో సందేశాలతో ప్రజల్లోనూ, సైన్యంలోనూ దేశభక్తిని, స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో జెలెన్ స్కీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దురాక్రమణ సందర్భంగా ఉక్రెయిన్ పౌరులకు కలిగిన ప్రతి నష్టానికి రష్యానే పరిహారం చెల్లిస్తుందని స్పష్టం చేశారు.
మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచయుద్ధం, మూడు పర్యాయాలు కరవులు, హోలోకాస్ట్ (యూదుల వధ), చెర్నోబిల్ విస్ఫోటనం, క్రిమియా దురాక్రమణ వంటి సంక్షోభాల నుంచి బయటపడి దేశాన్ని పునర్ నిర్మించుకున్నామని, ఇప్పుడు రష్యన్ల దాడులను కూడా తట్టుకుని నిలబడతామని, ఉక్రెయిన్ ను మళ్లీ నిర్మించుకుంటామని జెలెన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు.
రష్యా తమను చాలాసార్లు నాశనం చేయాలని చూసిందని, కానీ తాము లొంగిపోతామని ఎవరైనా భావిస్తే వారికి ఉక్రెయిన్ ప్రజల గురించి ఏమీ తెలియనట్టేనని వ్యాఖ్యానించారు. ఆ లెక్కన రష్యా అధ్యక్షుడు పుతిన్ కు కూడా ఏమీ తెలియదనే భావించాలని అన్నారు. కాగా, ఇప్పటివరకు 9 వేల మంది రష్యన్ సైనికులు మరణించారని జెలెన్ స్కీ వెల్లడించారు. మృతదేహాలను తరలించేందుకు రష్యా పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లను పంపిస్తోందని తెలిపారు.