Russia: ఉక్రెయిన్ సైనిక సత్తా.. రష్యా సుఖోయ్‌నే కూల్చేసింది!
- శత్రు దేశాలు ఇట్టే భయపడే సుఖోయ్ యుద్ధ విమానం రష్యా సొంతం
- ఉక్రెయిన్ గగన తలం మీదకు సుఖోయ్
- గురి తప్పకుండా దానిని కూల్చేసిన ఉక్రెయిన్
చిన్న దేశమైన ఉక్రెయిన్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా తక్కువగా అంచనా వేశారని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలు నిజమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ఓ చిన్నదేశమని, తన సైనిక సత్తా ముందు కేవలం గంటల్లోనే తోక ముడుస్తుందని, ఎలాంటి శ్రమ లేకుండానే చాలా ఈజీగానే ఉక్రెయిన్ తన చేతి కిందకు వస్తుందని పుతిన్ భావించినట్లున్నారు. అయితే అందుకు విరుద్ధంగా రష్యా సైనిక బలగాలకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైనికులు.. తాజాగా రష్యాకు మరో గట్టి షాకిచ్చారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన యుద్ధ విమానం సుఖోయ్ (ఎస్‌యూ-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్) రష్యా సైనిక పటాలంలో శత్రు దేశాలను ఇట్టే భయపెట్టే ఎయిర్ క్రాఫ్ట్. ఈ యుద్ధ విమానాన్ని కూల్చడం అంత ఈజీ కాదు. రష్యా కంటే సాంకేతిక పరిజ్ఞానంలో మెరుగ్గా ఉంటే తప్పించి అది సాధ్యం కాదు. అయితే చిన్న దేశమైనప్పటికీ ఉక్రెయిన్.. తన గగన తలం మీదకు వచ్చిన రష్యా సుఖోయ్ విమానాన్ని ఒక్క దెబ్బకు కూల్చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ సైనిక బలగాల కమాండర్ ఇన్ ఛీప్ లెఫ్ట్ నెంట్ జనరల్ వాలేరీ జాలుజ్నియి కాసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ సైనికులు రష్యా సుఖోయ్‌ను కూల్చడంలో పర్‌ఫెక్ట్‌గా పనిచేశారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.