Ukraine: ఉక్రెయిన్ అధ్య‌క్షుడిగా ఇత‌డిని నియ‌మించాల‌నుకుంటోన్న పుతిన్

victor to be ukraine president

  • పుతిన్‌ న‌మ్మ‌క‌స్తుడైన‌ విక్టర్‌ యానుకోవిచ్‌
  • ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ప‌నిచేసిన అనుభ‌వం
  • 2010లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా విక్టర్‌ 
  • అప్ప‌ట్లో పెద్ద ఎత్తున అల్ల‌ర్లు, హింస‌
  • ర‌ష్యాకు పారిపోయిన విక్ట‌ర్

ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుని అక్క‌డా తమ పాల‌నే ఉండాల‌ని ర‌ష్యా దాడులు కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే పూర్తి ప్ర‌ణాళిక‌ను ర‌చించుకుని దాని ప్ర‌కారం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇక ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకున్నాక దానికి అధ్య‌క్షుడిగా ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఎవ‌రిని నియ‌మించాల‌ని భావిస్తున్నార‌న్న విష‌యంపై అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయి. 

వాటి ప్ర‌కారం.. తనకు న‌మ్మ‌క‌స్తుడైన‌ విక్టర్‌ యానుకోవిచ్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నియమించాలని ఆయ‌న‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2010లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా విక్టర్‌ యానుకోవిచ్ ఎన్నికయ్యారు. అయితే, ఆయన రష్యాకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించేవారు. దీంతో అప్ప‌ట్లో ఈయూతో రాజకీయ, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఒప్పుకోలేదు. 

చివ‌ర‌కు 2013 నవంబర్‌ నుంచి ఉక్రెయిన్‌లో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున‌ ఆందోళ‌లు చెల‌రేగాయి. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవ‌డంతో ఆ త‌దుప‌రి ఏడాదే విక్ట‌ర్ ప‌ద‌విని కోల్పోయాడు. అక్క‌డి నుంచి ఆయన రష్యాకు పారిపోయి అక్క‌డే ఉంటున్నారు. ఆయ‌న తనకిచ్చిన మ‌ద్ద‌తు వ‌ల్ల పుతిన్ ఆయ‌న ప‌ట్ల సానుకూలంగా ఉన్నారు. ఆయ‌న‌పై ఉన్న అపార న‌మ్మ‌కం వ‌ల్ల ఆయ‌న‌ను మ‌ళ్లీ ఉక్రెయిన్‌ అధ్య‌క్షుడిగా చేయాల‌ని పుతిన్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

రష్యా ప్రభుత్వంతో విక్ట‌ర్‌కు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్ స్వాధీనం అనంత‌రం త‌మ శ‌క్తిని మరోసారి చాటిచెప్పినట్లు అవుతుంద‌ని, ఐరోపాలో మరోసారి రష్యా ప్రాబల్యాన్ని పెంచుకోవ‌చ్చ‌ని పుతిన్ అనుకుంటున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగిసిన వెంట‌నే ఆయ‌న విక్ట‌ర్‌ను అధ్య‌క్షుడిగా నియ‌మించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది.

  • Loading...

More Telugu News