Russia: యుద్ధం తీవ్ర‌త‌రం చేసిన ర‌ష్యా.. కీవ్ లోని మెట్రో స్టేషన్ వ‌ద్ద‌ భారీ పేలుళ్లు.. ఖేర్సన్ స్వాధీనం

russia attacks in ukrain

  • మొద‌ట్లో ప్ర‌భుత్వ ఆస్తులు, కార్యాల‌యాలే ల‌క్ష్యం
  • ఇప్పుడు జ‌నావాసాల‌పై కూడా బాంబులు
  • ఒబ్లాస్ట్, లవీవ్, మైకొలివ్, చెర్నిహివ్ లో దాడుల‌కు సిద్ధం

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల‌ను తీవ్ర‌త‌రం చేసింది. మొద‌ట్లో ప్ర‌భుత్వ ఆస్తులు, కార్యాల‌యాల‌నే ల‌క్ష్యంగా చేసుకుని దాడులు జ‌రిపిన ర‌ష్యా ఇప్పుడు జ‌నావాసాల‌పై కూడా దాడులు జరుపుతోంది. ర‌ష్యా దాడులు తీవ్రత‌రం చేసి ఆసుప‌త్రులు, పాఠ‌శాల‌లు, భ‌వ‌నాల‌పై కూడా దాడులు జ‌రుపుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ రోజు కీవ్లోని మెట్రో స్టేషన్ స‌మీపంలో భారీ పేలుళ్లు సంభ‌వించాయి. 

డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ వద్ద పేలుళ్లు సంభ‌వించ‌డంతో అక్క‌డ పెద్ద ఎత్తున ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. కీవ్ న‌గ‌రంలోని ఇత‌ర ప్రాంతాల్లోనూ ర‌ష్యా బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను స్వాధీనం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ర‌ష్యా దాడులు కొన‌సాగిస్తోంది. ఖేర్సన్ నగరాన్ని త‌మ అధీనంలోకి తెచ్చుకుంది. 

ఒబ్లాస్ట్, లవీవ్, మైకొలివ్, చెర్నిహివ్, త‌దిత‌ర‌ ప్రాంతాల్లో ర‌ష్యా వైమానిక దాడుల‌కు సిద్ధ‌మైంది. త‌మ‌పై విధించిన ఆంక్ష‌ల‌ను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధ‌మ‌ని ర‌ష్యా ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ర‌ష్యా దాడుల నేప‌థ్యంలో ఉక్రెయిన్లో వలసలు పెరిగాయని ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 10 లక్షల మంది ఇత‌ర‌ దేశాలకు వెళ్లారని ఓ నివేదికలో పేర్కొంది. 

మ‌రోవైపు, ఇత‌ర దేశాల జోక్యం పెరిగితే ఉక్రెయిన్ తో యుద్ధంలో అణ్వస్త్రాల‌ను వాడ‌డానికి కూడా ర‌ష్యా వెన‌కాడ‌బోద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే అణుయుద్ధం విష‌యంలో దేశ బలగాలను ర‌ష్యా అప్రమత్తం చేసిన విష‌యం తెలిసిందే.  రష్యా వద్ద 5,997 అణు వార్ హెడ్లు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తెలిపింది. 

రష్యా దాడులు తీవ్ర‌త‌రం చేసిన‌ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి విదేశీయులు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. పొరుగు దేశాల‌కు చేరుకునే క్ర‌మంలో చాలా మందికి ఆహారం అంద‌ట్లేదు. జ‌నావాసాల‌పై కూడా ర‌ష్యా దాడులు జ‌రుపుతుండ‌డంతో ఉక్రెయిన్ ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల్లో ఉన్నారు. 

  • Loading...

More Telugu News