Chittoor District: సినీనటులు మోహన్‌బాబు, విష్ణు దరఖాస్తు పట్టా భూములపై స్పందించిన చంద్రగిరి తహసీల్దార్
- చంద్రగిరి మండలంలో మోహన్‌బాబు, విష్ణు పేరిట పట్టా భూములు
- సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
- ఆన్‌లైన్‌లో డీకేటీ భూములుగానే చూపిస్తుండడంతోనే సమస్య వచ్చిందన్న తహసీల్దార్
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 412-1ఎ లోని 2.79 ఎకరాలు సినీనటుడు మోహన్‌బాబు, 412-1బిలో 1.40 ఎకరాలను ఆయన తనయుడు మంచు విష్ణు పేరిట దరఖాస్తు పట్టా జారీ చేయడం వివాదాస్పదమైంది. వీరిద్దరూ నిరుపేదలా? అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేయడంపై చంద్రగిరి తహసీల్దార్ శిరీష స్పందించారు.
రికార్డులను పరిశీలించిన అనంతరం రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 412-1లో 5.29 ఎకరాల భూమికి 1928లో దరఖాస్తు పట్టాలు మంజూరు చేసినట్టు చెప్పారు. 1942 నుంచి 2001 వరకు ఈ భూమిపై 11 సార్లు క్రయవిక్రయాలు జరిగినట్టు చెప్పారు. 18 జూన్ 1954 కంటే ముందు మంజూరైన దరఖాస్తు పట్టా భూములను తొలుత నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2016లో అప్పటి ప్రభుత్వం జీవో 215ను జారీ చేసినట్టు చెప్పారు. దీంతో మోహన్‌బాబు, విష్ణు పేరిట ఉన్న భూములు డీకేటీ నుంచి పట్టా భూములుగా మారాయని, అయితే ఆన్‌లైన్‌లో మాత్రం డీకేటీగానే కొనసాగుతుండడంతో సమస్య తలెత్తిందని శిరీష వివరించారు.