Russia: సందిగ్ధంలో రెండో విడత చర్చలు.. ఉక్రెయిన్ నుంచి స్పందన నిల్
- రెండో విడత చర్చలకు సిద్ధమని రష్యా ప్రకటన
- నేటి సాయంత్రంలోగా మొదలు కావలసిన చర్చలు
- బాంబు దాడులు ఆపితేనే చర్చలన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఉక్రెయిన్, రష్యాల మధ్య బుధవారం జరగాల్సిన రెండో విడత చర్చలపై సందిగ్ధం నెలకొంది. వాస్తవానికి రెండో విడత చర్చలకు ఇరు దేశాలు అంగీకరించినా.. బుధవారం సాయంత్రంలోగా చర్చలు మొదలు కావాల్సి ఉంది. అయితే రాత్రయినా కూడా ఇరు దేశాల మధ్య చర్చలు మొదలు కాలేదు. దీంతో ఇరు దేశాల మధ్య రెండో విడత చర్చలు జరుగుతాయా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
ఉక్రెయిన్‌పైకి దండెత్తి వచ్చిన రష్యా.. యుద్ధం మొదలైన రెండో రోజే శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా తమ దేశంపై బాంబు దాడులను ఆపితేనే చర్చలకు వస్తామని చెప్పిన ఉక్రెయిన్ ఆ తర్వాత చర్చలకు అంగీకరించింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇరు దేశాల మధ్య రష్యా మిత్ర దేశంగా పరిగణిస్తున్న బెలారస్‌లో ఇరు దేశాల మధ్య తొలి విడత చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో ఇరు దేశాలు తమ తమ వాదనలకు కట్టుబడి ఉండగా..చర్చల్లో ఎలాంటి ఫలితం రాకుండానే ముగిశాయి. ఈ క్రమంలో మరో దఫా చర్చలకు రష్యా సిద్ధపడగా... అందుకు ఉక్రెయిన్ కూడా అంగీకరించింది.
ఇరు దేశాల ఒప్పందం ప్రకారం బుధవారం మధ్యాహ్నం తర్వాత చర్చలు మొదలుకావాల్సి ఉంది. ఈ చర్చల కోసం తమ ప్రతినిధి బృందం సిద్ధంగానే ఉందని రష్యా అధ్యక్ష భవనం ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. అంతేకాకుండా ఓ వైపు చర్చలంటూనే రష్యా తమ నగరాలపై బాంబులతో భీకర దాడులకు పాల్పడుతోందని, ముందుగా దాడులు ఆపితేనే చర్చలంటూ బుధవారం ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రెండో దశ చర్చలు జరుగుతాయా అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.