YS Vivekananda Reddy: వివేకా కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత
- వివేకా హత్య కేసులో ఏ5గా దేవిరెడ్డి
- హత్యకు రూ.40 కోట్లు సుపారీ ఇచ్చేందుకు దేవిరెడ్డి సిద్ధమని దస్తగిరి వాంగ్మూలం
- సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదన
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ, కేసులో ఏ5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కడప కోర్టు తిరస్కరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఈ కారణంగా శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దంటూ సీబీఐ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.
అనారోగ్యం కారణంగా కడప రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నానని, తన అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలంటూ దేవిరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వివేకా హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో దేవిరెడ్డి కీలక నిందితుడిగా ఉన్నాడని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వివేకా హత్యకు ఏకంగా రూ.40 కోట్లు సుపారీ ఇచ్చేందుకు దేవిరెడ్డి సిద్ధంగా ఉన్నాడని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లుగా దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.