ap government: ఏపీ సీఎంవోలో ఎవరెవరికి ఏ బాధ్యతలంటే..?
![Orders issued on Wednesday assigning clear responsibilities to the officers in the AP CMO](https://imgd.ap7am.com/thumbnail/cr-20220302tn621f4ee3dd7cd.jpg)
- ధనుంజయ్ రెడ్డికి ఆర్థిక, ప్రణాళిక, మునిసిపల్, ఇంధన శాఖ సహా కీలక శాఖలు
- జవహర్ రెడ్డికి జీఏడీ, హోం, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖలు
- ఆరోఖియరాజ్‌కు సంక్షేమ శాఖలు, విద్య, పంచాయతీ రాజ్ శాఖలు
- రేవు ముత్యాలరాజుకు హౌసింగ్, స్కిల్ డెవలప్‌మెంట్
ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో అధికారులకు స్పష్టమైన బాధ్యతలను కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇటీవల ప్రవీణ్‌ను సీఎంవో నుంచి బదిలీ చేశాక మరో సీనియర్ ఐఏఎస్ కేఎస్ జవహర్ రెడ్డిని సీఎంవోకు రప్పించారు. స్పెషల్ సీఎస్ హోదాలో జవహర్ రెడ్డి సీఎంవో వ్యవహారాలను పర్యవేక్షిస్తారని అంతా భావించారు. అయితే జవహర్ రెడ్డితో పాటు ఇంకో ముగ్గురు ఐఏఎస్‌లు ఉన్న నేపథ్యంలో ఆయా శాఖల పర్యవేక్షణ బాధ్యతలను పంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. జవహర్ రెడ్డికి జీఏడీ, హోం, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, వైద్య ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెసిడ్యువల్ తదితర శాఖలను కేటాయించారు.
సీఎం కార్యదర్శిగా ఉన్న సాల్మన్ ఆరోఖియరాజ్‌కు పౌరసరఫరాలు, విద్యా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు కేటాయించారు. సీఎం మరో కార్యదర్శిగా ఉన్న ధనుంజయ్ రెడ్డికి ఆర్థిక, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయ, అనుబంధ రంగాలు, మున్సిపల్ పరిపాలన, ఇంధన, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలు కేటాయించారు.
ఇక సీఎం అడిషనల్ సెక్రెటరీగా ఉన్న రేవు ముత్యాలరాజుకు ప్రజా ప్రతినిధుల వినతులు, రెవెన్యూ (ల్యాండ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్), హౌసింగ్, రవాణా, రోడ్లు, భవనాలు, కార్మిక, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలు కేటాయించారు.