Swami Prasad Maurya: యూపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి మౌర్య కాన్వాయ్‌పై దాడి
- కుషీనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు
- తనపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారన్న స్వామి ప్రసాద్
- కుషీనగర్ స్థానానికి రేపు పోలింగ్
యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పరిస్థితి చాలా హాట్ గా ఉంది. పోలింగ్ ప్రక్రియకు మరి కొన్ని విడతలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు యూపీలోని కుషీనగర్ లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇటీవలే బీజేపీకి గుడ్ బై చెప్పి, సమాజ్ వాదీ పార్టీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య వాహనంపై రాళ్ల దాడి జరిగింది. బీజేపీ కార్యకర్తలే తనపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆయన ఆరోపించారు.
కుషీనగర్ జిల్లా ఫజిల్ నగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి రేపు పోలింగ్ జరగనుంది. నిన్న సాయంత్రం ప్రచారం ముగిసింది. తాను ఎన్నికల పనుల్లో ఉన్నప్పుడు ఈ దాడి జరిగిందని ఆయన చెప్పారు. దాడిలో తన డ్రైవర్ చెవికి గాయమయిందని... ఆ సమయంలో తాను తన వాహనంలో కాకుండా, మరో వాహనంలో ఉన్నందున దాడి నుంచి తప్పించుకున్నానని తెలిపారు.
ఈ దాడిపై స్వామి ప్రసాద్ మౌర్య కుమార్తె సంఘమిత్ర మౌర్య మాట్లాడుతూ, దాడిని ఖండించారు. దాడి వెనుక అధికార పార్టీలోని ప్రముఖుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఫజిల్ నగర్ బీజేపీ అభ్యర్థి ప్రమేయంతోనే దాడి జరిగిందని అన్నారు.