Russia: రాజ్ పుత్ లపై మొఘలుల మారణహోమంలా రష్యా విధ్వంసకాండ: భారత్ లో ఉక్రెయిన్ రాయబారి
- యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలి
- అన్ని వనరులను వాడుకోవాలని విజ్ఞప్తి
- మానవతా సాయంపై విదేశాంగ శాఖ అధికారులతో భేటీ
భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పొలిఖా.. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని మొఘలుల దాడితో పోల్చారు. నిన్న ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మృతి వార్త తెలిసిన తర్వాత ఆయన.. ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. రష్యా యుద్ధాన్ని ఆపేలా ప్రధాని నరేంద్ర మోదీ సాయం చేయాలని వేడుకున్నారు.
రాజ్ పుత్ లపై మొఘలుల మారణహోమంలాగానే.. రష్యా సైన్యం తమపై దాడి చేస్తోందని అన్నారు. యుద్ధాన్ని ఆపించేందుకు ప్రపంచంలోని ప్రభావవంతమైన నేతలందరికీ తాము విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. రష్యా దాడిని ఆపేందుకు అవసరమైన అన్ని వనరులను వాడుకుని యుద్ధాన్ని నిరోధించాల్సిందిగా మోడీని కోరుతున్నానని చెప్పారు.
ఉక్రెయిన్ కు మానవతా సాయంపై చర్చించేందుకు విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమైనట్టు చెప్పారు. తమకు సాయం చేస్తున్నందుకు భారత్ కు కృతజ్ఞతలు చెప్పారు. వీలైనంత ఎక్కువ సాయమందేలా చూస్తామంటూ భారత విదేశాంగ కార్యదర్శి హామీ ఇచ్చారన్నారు.