Spectators: కోహ్లీ 100వ టెస్టు నేపథ్యంలో మొహాలీ మైదానంలో ప్రేక్షకులకు అనుమతి
- మార్చి 4 నుంచి టీమిండియా, శ్రీలంక తొలి టెస్టు
- కెరీర్ లో అరుదైన మైలురాయి ముంగిట కోహ్లీ
- ప్రేక్షకులకు అనుమతిపై ప్రకటన చేసిన బీసీసీఐ కార్యదర్శి
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. మొహాలీలో ఈ నెల 4 నుంచి టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి టెస్టు కోహ్లీ కెరీర్ లో 100వ టెస్టు మ్యాచ్. ఈ నేపథ్యంలో, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మొహాలీ మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించాలని తాజాగా నిర్ణయించింది.
గతంలో కరోనా ప్రభావం వల్ల తొలి టెస్టును ప్రేక్షకుల్లేకుండానే నిర్వహించాలని బీసీసీఐ భావించింది. అయితే, కోహ్లీ ఘనత నేపథ్యంలో తన పాత నిర్ణయాన్ని బీసీసీఐ పునఃసమీక్షించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రేక్షకులను అనుమతించే విషయమై పంజాబ్ క్రికెట్ సంఘంతో చర్చించామని, కోహ్లీ కెరీర్ లో ముఖ్యమైన 100వ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించడంపై వారు సానుకూలంగా స్పందించారని జై షా వెల్లడించారు.