Ukraine: ఉక్రెయిన్‌లో చనిపోయిన నవీన్ ఫ్యామిలీకి మోదీ ఫోన్
- ఐదు రోజులుగా బంకర్‌లో తలదాచుకున్న నవీన్
- మంగళవారం ఉదయం బంకర్ నుంచి బయటకు రాక
- రష్యా దాడుల్లో మృత్యువాత
- నవీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ
- మృతదేహం తెప్పించేందుకు రంగంలోకి కర్ణాటక సీఎం
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో భారతీయ విద్యార్థి నవీన్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న నవీన్..కర్ణాటకకు చెందిన వాడు. యుద్ధం మొదలైన నాటి నుంచి తొటి విద్యార్థులతో కలిసి బంకర్‌లో తలదాచుకుంటున్న నవీన్ మంగళవారం ఉదయం బంకర్ నుంచి బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా రష్యా చేసిన దాడుల్లో అతడు మరణించాడు.
ఈ విషయాన్ని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించగా.. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని మృతుడి కుటుంబానికి ఫోన్ చేశారు. నవీన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరోవైపు నవీన్ మృతిపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నవీన్ మృతదేహాన్ని తరలించేందుకు ఆయన విదేశాంగ శాఖతో మాట్లాడారు.