kkr: ‘దూకుడైన కోచ్’ మెక్ కల్లమ్ తో కలసి పనిచేస్తా: శ్రేయాస్ అయ్యర్
- గౌతమ్ గంభీర్ వారసత్వాన్ని నిలబెడతా
- కోల్ కతా నైట్ రైడర్స్ ను బలంగా నిర్మిస్తా
- కోచ్ మెక్ కల్లమ్ ఎంతో దూకుడైన వ్యక్తి
- ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానన్న అయ్యర్
స్వతహాగా దూకుడైన ఆటగాడిగా పేరున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కోల్ కతా నైట్ రైడర్స్ చీఫ్ కోచ్ బ్రెండాన్ మెక్ కల్లమ్ తో కలిసి పని ప్రారంభించేందుకు వేచి చూస్తున్నట్టు డాషింగ్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ప్రకటించాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వ్యవహరించిన అయ్యర్.. 2020 సీజన్ లో సెమీ ఫైనల్స్ వరకూ తీసుకెళ్లాడు. అయినా ఢిల్లీ క్యాపిటల్స్ అతడ్ని రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు వేలంలోకి వెళ్లి కోల్ కతా నైట్ రైడర్స్ గూటికి చేరాడు. ఆ జట్టు అయ్యర్ ను కెప్టెన్ గా ఎంచుకోవడం తెలిసిందే.
కోల్ కతా జట్టు కోచ్ బ్రెండాన్ మెక్ కల్లమ్ ను దూకుడైన కోచ్ అని అయ్యర్ అభివర్ణించాడు. ‘‘కల్లమ్ ఎంతో దూకుడైన కోచ్ అని నా అభిప్రాయం. న్యూజిలాండ్ కు అతడు ఆడే సమయంలో చూసినా ఎంతో దూకుడుగా కనిపించేవాడు. రిస్క్ తీసుకునే వ్యక్తి. దాన్ని నేను ఎంతో ఇష్టపడతా. వేలం తర్వాత కోచ్ తో పలు సార్లు మాట్లాడాను. అతడు ప్రశాతంగా ఉంటాడు. అతనితో కలసి పని మొదలు పెట్టేందుకు వేచి చూస్తున్నాను’’అని అయ్యర్ ప్రకటించాడు.
గౌతమ్ గంభీర్ నాయకత్వంలో 2012, 2014లో కోల్ కతా ఐపీఎల్ టైటిల్ గెలవగా, అదే వారసత్వాన్ని నిర్మించాలనుకుంటున్నట్టు అయ్యర్ చెప్పాడు. గతంలో జట్టుకు గొప్ప సేవలు అందించిన వారిని అభినందిస్తున్నానంటూ.. వారి అడుగు జాడల్లోనే నడుస్తానని పేర్కొన్నాడు.