Medical students: ఉక్రెయిన్ లో మెడికల్ కోర్సులు చేస్తున్న తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి?

No clarity on future for now Medical students from Ukraine

  • 'నీట్'లో తక్కువ స్కోరు వచ్చిన వారే ఉక్రెయిన్ కు  
  • అక్కడ పదేళ్లలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయచ్చు 
  • ఇప్పుడు ఆపివేసినా తిరిగి పూర్తి చేసుకునే ఛాన్స్
  • యుద్ధం త్వరగా సమసిపోతే యథావిధిగా చదువులు

ఉన్న చోట నుంచి ఉరుకులు పరుగుల మీద బయట పడాల్సిన పరిస్థితి. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. చదువు సంగతి తర్వాత.. ముందు బతికి బయట పడితే తర్వాత చూసుకోవచ్చులే! ఇదీ ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులతోపాటు భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ. 

దాదాపు అందరూ తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతుంటే, కొందరు మాత్రం చదువు నష్టపోతామన్న ఆందోళనతో అక్కడే ఉండాలనుకుంటున్నారు. వెళితే తమ చదువు, భవిష్యత్తు ఏంటన్న సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు భారత రాయబార అధికారులు మాత్రం.. చదువుకుంటున్న కాలేజీల్లో అంత మందికి వసతి కల్పించడం అసాధ్యమని చెబుతున్నారు.

విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల లైసెన్సియేట్ నిబంధనల ప్రకారం.. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసేందుకు ఒక విద్యార్థికి పదేళ్ల సమయం ఉంటుంది. కోర్సు కాల వ్యవధి  6 ఏళ్లు. ఇందులో ఒక ఏడాది పాటు భారత్ లో ఇంటర్న్ షిప్ ఉంటుంది. 

ఎప్పుడు యూనివర్సిటీలు తెరుస్తారు. ఎప్పుడు వెనక్కి పిలుస్తారనే దానిపై స్పష్టత లేదని, ప్రస్తుతానికి అయితే యూనివర్సిటీలను విడిచి వెళుతున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. భారతీయ విద్యార్థుల రక్షణే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యంగా జాతీయ వైద్య మండలి చెబుతోంది. 

ఉక్రెయిన్ లో వైద్య కోర్సుల నుంచి అర్థాంతరంగా వచ్చేస్తున్న వారికి దేశీయ వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేయడం సాధ్యపడదని ఇక్కడి కాలేజీ ప్రిన్సిపాల్స్ అభిప్రాయంగా ఉంది. సీట్లు తక్కువగా ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. భారత్ నుంచి విదేశీ విద్య కోసం వెళ్లిన వారు నీట్ లో తక్కువ స్కోరు సంపాదించిన వారని అంటున్నారు. కరోనా వెలుగు చూసిన తర్వాత చైనాలో వైద్య విద్యను ఆపేసి వచ్చిన వారికి ఇక్కడ అడ్మిషన్లు ఇవ్వని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 

నిజానికి కరోనా కారణంగా గత రెండేళ్లుగా వైద్య విద్యార్థులు కళాశాలలకు దూరమయ్యారు. ఉక్రెయిన్ లోనే ఉంటూ ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. రెండేళ్ల తర్వాత కళాశాలలకు వెళ్లి చక్కగా చదువుకోవచ్చని అనుకుంటున్న తరుణంలో యుద్ధం వారి ఆశలపై నీళ్లు చల్లింది. యుద్ధం త్వరగా సమసిపోతే.. విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్ కళాశాలల్లో చేరే అవకాశం ఉంటుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News