YS Jagan: ఓటీఎస్ లబ్ధిదారులకు రూ.3 లక్షల రుణం: ఏపీ సీఎం జగన్
![AP CM Jagan says Loan of Rs 3 lakh to OTS beneficiaries](https://imgd.ap7am.com/thumbnail/cr-20220228tn621cef979e7d5.jpg)
- ఓటీఎస్‌తో లిటిగేషన్ లేని క్లియర్ టైటిల్
- దానిని బ్యాంకులో పెడితే రూ.3 లక్షల రుణం
- ఓటీఎస్ సమీక్షలో జగన్ వెల్లడి
ఏపీలో పేదలకు పలు సంక్షేమ పథకాలు అమలుజేస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా ఓటీఎస్ లబ్ధిదారులకు మరో ప్రయోజనాన్ని చేకూర్చడానికి నిర్ణయించారు. రూ.20 వేలు కట్టి ఓటీఎస్ తీసుకునే లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రూ.3 లక్షల రుణాన్ని ఇప్పించేలా ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం జగన్ సంచలన ప్రకటన చేశారు.
సోమవారం నాడు ఓటీఎస్ పథకంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు వై శ్రీలక్ష్మి, అజయ్ జైన్, రజత్ భార్గవ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంపూర్ణ గృహహక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రూ.20వేలు కట్టి ఓటీఎస్ తీసుకోవటం ద్వారా ఎటువంటి లిటిగేషన్ లేని క్లియర్ టైటిల్ లబ్దిదారులకు వస్తుందని సీఎం పేర్కొన్నారు. ఆ కాగితాలను బ్యాంకులో పెట్టి రూ.3 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దీని వల్ల లబ్దిదారులు మరింత అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు.