Ukraine: ముగిసిన రష్యా, ఉక్రెయిన్ చర్చలు
- బెలారస్ కేంద్రంగా ఇరు దేశాల చర్చలు
- 3 గంటల పాటు నాన్ స్టాప్ మంతనాలు
- ఫలితంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి
భీకర పోరు సాగిస్తున్న రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ముగిశాయి. బెలారస్ కేంద్రంగా సోమవారం మధ్యాహ్నం తర్వాత మొదలైన చర్చలు ఏకంగా 3 గంటల పాటు కొనసాగాయి. ఈ భేటీలో ఇరు దేశాల విదేశాంగ శాఖలకు చెందిన ప్రతినిధి బృందాలు పాలుపంచుకున్నాయి.
రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బెలారస్‌లో చర్చలకు తాము వ్యతిరేకమంటూ రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చర్చలకు తొలుత రష్యానే ప్రతిపాదన చేయగా.. అందుకు అంగీకరించిన జెలెన్‌స్కీ చర్చలను బెలారస్‌లో కాకుండా తటస్థ వేదికపై జరిపితే ఆలోచిస్తామంటూ చెప్పారు. అయితే రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్‌లో పరిస్థితి నానాటికీ విషమిస్తున్న నేపథ్యంలో బెలారస్‌లోనే చర్చలకు జెలెన్‌స్కీ అంగీకరించారు. 3 గంటల పాటు సుధీర్ఘంగా జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం వచ్చిందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.