FIFA: రష్యాకు షాకిచ్చిన ఫిఫా.. పలు ఆంక్షలు విధిస్తూ ప్రకటన
- రష్యాలో అంతర్జాతీయ మ్యాచ్ లు ఉండవు
- రష్యా పతాకానికి చోటు లేదు
- రష్యా జాతీయ గీతాలాపన కూడా ఉండదన్న ఫిఫా
అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ఫిఫా రష్యాపై పలు ఆంక్షలను ప్రకటించింది. రష్యాలో ఇక మీదట ఎటువంటి అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించబోమని తెలిపింది. అలాగే, అంతర్జాతీయ మ్యాచ్ ల సందర్భంగా రష్యా పతాకం కానీ, రష్యా జాతీయ గీతాన్ని ఆలపించడం కానీ చేయబోమని ప్రకటించింది.
ఫుట్ బాల్ యూనియన్ ఆఫ్ రష్యా (ఆర్ఎఫ్ యూ), తటస్థ వేదికలపై ప్రేక్షకులు లేకుండా ఆటలు నిర్వహించుకోవచ్చని ఫిఫా స్పష్టం చేసింది. పలు క్రీడా సమాఖ్యలు, క్లబ్ లు రష్యాలో పోటీలను రద్దు చేసుకుంటూ ఉండడంతో ఫిఫా నుంచి ఈ నిర్ణయం రావడం గమనార్హం.
వచ్చే నెలలో మొదలయ్యే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ లో రష్యాతో తమ జట్లు తలపడబోవని ఇప్పటికే పోలండ్, చెక్ రిపబ్లిక్, స్వీడన్ ప్రకటించాయి. తమ జాతీయ జట్టు రష్యాతో ఎటువంటి మ్యాచ్ ల్లోనూ పాల్గొనబోదంటూ ఇంగ్లండ్ ఫుట్ బాల్ అసోసియేషన్ సైతం ప్రకటించింది.